PV NEWS/వార్డ్ సచివాలయాల తనిఖీ… కార్యదర్శులకు పలు సూచనలు… కమిషనర్ బాపిరెడ్డి

24

PV NEWS/ NELLORE;-సచివాలయంలో అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన పెంచాలని వార్డు కార్యదర్శులకు నెల్లూరు నగర కమిషనర్ టి బాపిరెడ్డి సూచించారు. 20వ డివిజన్ అరవిందనగర్, టెక్కేమిట్ట, శోధన్ నగర్ తదితర ప్రాంతాలలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, పారిశుద్ధ్య విభాగ సిబ్బందితో కలిసి పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూసలపాలెం ప్రాంతంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరు అయిన రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. టెక్కేమిట్ట ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికులతో ప్రతి వారం గ్యాంగ్ వర్క్ పనులు చేపట్టాలని శానిటరీ సూపర్వైజర్ ను ఆదేశించారు. అదే విధంగా పత్తేఖాన్ పేట లోని రైతుబజారును సందర్శించారు. చేతి గ్లౌసులు మాస్కులు ధరించి విక్రయాలు జరిపే విధంగా పర్యవేక్షించాలని, ప్రతీ మూడు రోజులకు ఒకసారి రైతు బజారులో సోడియం క్లోరైడ్ ద్రావకం పిచికారీ చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగ కార్యదర్శులు ఇంటింటి చెత్త సేకరణ, డ్రెయిన్ కాలువల పూడిక తీత, ట్రేడ్ లైసెన్సులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అమెనిటీస్ సెక్రటరీలు ఆయా వార్డులోని మంచి నీటి కొళాయిల లీకేజీలు అరికట్టి, పైపు లైను రిపేర్లను చేపట్టాలని, అక్రమ మంచినీటి కుళాయిలను గుర్తించి వాటిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. వార్డు అడ్మిన్ సెక్రటరీలు ప్రాపర్టీ టాక్స్ డిమాండ్ నోటీసుల మంజూరు, రెవెన్యూ కలెక్షన్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ సేవలపై లబ్ధిదారులకు అవగాహన పెంచాలని సూచించారు. వార్డు ప్లానింగ్ సెక్రటరీలు నగర పట్టణ ప్రణాళిక విభాగం సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్మాణాలు జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.