ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

100

ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు-2020, ఏపీ సీఆర్‌డీఏ రద్దు బిల్లు-2020లకు రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం పలికారు.

ఈ ఏడాది జనవరి నెలలో ఈ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం పలికింది. అయితే, శాసనమండలిలో ఈ బిల్లులను చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపించారు.

దాంతో దానిపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండా అలానే ఉండిపోయింది. మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుల గడువు దాటిపోయినందున వాటికి ఆమోదం దొరికినట్లేనని చెబుతూ ప్రభుత్వం వాటిని ఇటీవల గవర్నరు ఆమోదానికి పంపించింది. గవర్నరు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ఇంతకీ బిల్లులో ఏముంది?

విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణిస్తూ ఈ బిల్లు రూపొందించారు.

సెక్రటేరియేట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని బిల్లులో వివరించారు.

జనవరి నెలలో ఈ బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై ఆమోదం పలికాక అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందగా మండలిలో మాత్రం పాలక వైసీపీకి బలం తక్కువగా ఉండడంతో ఆమోదం దక్కలేదు.

లోకల్ జోన్లు, జోనల్ డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని వికేంద్రీకరణ బిల్లులో ప్రతిపాదించారు.

“పరిపాలన సంబంధిత వ్యవహారాలు మొత్తం విశాఖ నుంచి జరుగుతాయి. రాజ్ భవన్, సచివాలయం, విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు చేయాలి. శాసన కార్యకలాపాలన్నీ అమరావతిలోనే సాగుతాయి. న్యాయ సంబంధిత కార్యకలాపాలు మొత్తం కర్నూల్ నగరం నుంచి జరుగుతాయి. న్యాయవ్యవస్థ ఆమోదం తెలిపిన తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు మీద నిర్ణయం ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి” అని ఈ బిల్లులో పేర్కొన్నారు.

సీఆర్డీయే రద్దు బిల్లు ఏమిటి

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)ను రద్దు చేయడానికి ఉద్దేశించిన బిల్లు ఇది.