ఎల్లుండి మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. ఏం నిర్ణయం తీసుకుంటారు?

70

దేశంలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఆంక్షలు సడలింపుతో ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కాగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు రావడం వల్ల పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. జులై 27న సోమవారం నాడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై చివరిసారిగా జూన్ 16,17 తేదీల్లో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్  విజృంభిస్తుండటంతో మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

అయితే, కేవలం మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతోనే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న అన్‌లాక్ 2.0పై రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. దేశంలో వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావడం ఇది ఏడోసారి. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించి, వారి అభిప్రాయాలను తీసుకుంటారు. అనంతరం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేయనున్నారని తెలుస్తోంది. జులై నెలలోనే ఇప్పటి వరకూ దాదాపు 8 లక్షల వరకూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి