నెల్లూరు జిల్లాలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు…

158

PV NEWS/ NELLORE;-యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నెల్లూరు జిల్లా వాసులకూ దడ పుట్టిస్తోంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు జిల్లాలోనే నమోదయ్యింది. ఇటీవల కాలంలో నిత్యం 20 నుంచి 30 కేసులు నమోదు అయ్యేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 100కి చేరడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కరోనా నియంత్రణ పట్ల ప్రజల్లో ఎంత అవగాహన తీసుకు వచ్చినప్పటికీ చైతన్యం కలగడం లేదు. వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడంలేదు. నగరం నడిబొడ్డు ప్రాంతాలైన సంతపేట, కోటమిట్ట మూలపేట తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అంత్యక్రియలకు, శుభకార్యాలకు, సమావేశాలకు అధిక సంఖ్యలో హాజరు కావద్దని హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. సంతపేట లో కరోనా వ్యాధి తో మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 100 మందిలో 15 మందికి కరోనా పాజిటివ్ నమోదయ్యింది. మరికొందరి ఫలితాలు రావాల్సి ఉంది. ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు లాక్ డౌన్ సడలింపులు చేసిన ప్రభుత్వానికి కరోనా కట్టడి పెను సవాల్ గా మారింది. కరోనా వ్యాప్తి పట్ల ఆందోళన చెందుతున్న ప్రజలే నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. గడచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో వంద కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1170 కి చేరింది. ముఖ్యంగా నగరంలోని సంతపేట లో 15, వేదయపాలెం 8, దర్గామిట్ట 5, పొదలకూరు రోడ్డు 4, డై క్రాస్ రోడ్డు 3, మొత్తంగా నెల్లూరు నగరంలో 60కి పైగా కేసులు నమోదయ్యాయి.