తడి,పొడి చెత్త సేకరణపై ప్రజలు అవగాహన పెంచుకోండి- కమిషనర్ దినేష్ కుమార్

29

PV NEWS/ NELLORE ;- తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించినపుడే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా దాన్ని సాంప్రదాయక ఎరువులుగా మార్చగలమని, నగర ప్రజలంతా తమ బాధ్యతగా భావించి ఆ పద్ధతిని పాటించాలని కమిషనర్ దినేష్ కుమార్ కోరారు. సానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు పటిష్ట ప్రణాళికలను రూపొందించి, కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగం, సచివాలయ సిబ్బందిల పర్యవేక్షణలో రాబోవు 6నెలల్లో మెరుగైన ఫలితాలను అందుకుంటామని ఆకాంక్షించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకై నూతనంగా మరో 20 చెత్త తరలింపు వాహనాలను సిబ్బందికి అందించి, అవసరమైన అన్ని ప్రాంతాల్లో చెత్త కుండీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణకు అవసరమైన నెట్టుడు వాహనాలతో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక రక్షణా ఉపకరణాలను అందజేస్తామని చెప్పారు. దెబ్బతిన్న చెత్తకుండీలనుంచి పశువులు, పందుల ద్వారా వ్యర్ధాలు వీధుల్లోకి వెదజల్లబడుతున్న కారణంగా, అలాంటి కుండీలను గుర్తించి, వాటి స్థానంలో త్వరితగతిన నూతనవాటిని అమర్చుతామని కమిషనర్ పేర్కొన్నారు. మినీ బైపాస్, గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్ మార్గాలను మోడల్ రోడ్స్ గా తీసుకుని స్మార్ట్ చెత్త కుండీల ఏర్పాటుతో పాటు, వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేసి రీసైక్లింగ్ చేసే నూతన నిర్మాణాల ఏర్పాటుకై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా దొంతాలి యార్డులో 10 టన్నుల వ్యర్ధాల రీసైక్లింగ్ యూనిట్ నిర్మాణానికి సన్నద్ధం అవుతున్నామని కమిషనర్ ప్రకటించారు. వ్యర్ధాల రీసైక్లింగ్ విధానాలకు అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు, డంపింగ్ యార్డులలో నిల్వ ఉన్న సాంప్రదాయక ఎరువుల కొనుగోళ్లకై సంబంధిత పరిశ్రమలకు ఆహ్వానాలు పంపామని కమిషనర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ప్రసాద్, ఎం. హెచ్.ఓ డాక్టర్ వెంకట రమణ, ఎస్.ఈ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.