ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నెల్లూరు సాధ్యం-కమిషనర్ దినేష్ కుమార్

58

PV NEWS/ NELLORE; – పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచి, నూతన విధానాలపై చైతన్యం కలిగించినపుడే స్వచ్ఛ నెల్లూరు నగర నిర్మాణం సాధ్యమని కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సురక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక విఆర్ కళాశాల కూడలి నుంచి మద్రాసు బస్టాండు వరకు “శ్రమదాన్” ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుకు కార్పొరేషన్ అందిస్తున్న వివిధ రకాల సేవలపై ప్రజల్లో చైతన్యం పెంచి, అభివృద్ధి ప్రణాళికల్లో వారిని భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2021, సఫాయీ మిత్ర సురక్షా ఛాలెంజ్, గార్బేజ్ ఫ్రీ సిటీ వంటి పోటీల్లో నెల్లూరు కార్పొరేషన్ ఉత్తమ ర్యాంకు సాధించే దిశగా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్ధాలను వీధుల్లో విసర్జించడం వంటి ఆలోచనలను మార్చుకుని, గత ఏడాది సాధించిన 186 వ ర్యాంకు కన్నా ఉత్తమ ఫలితాన్ని ఈసారి సాధించాలని కమిషనర్ ఆకాంక్షించారు. ముఖ్యంగా తడి, పొడి వ్యర్ధాలను విడివిడిగా ఉంచినపుడే వాటిని రీసైక్లింగ్ విధానం ద్వారా సేంద్రీయ ఎరువులుగా మార్చలమని తెలిపారు. ప్రజల సమస్యలు అనుక్షణం తెలుసుకునేందుకు వీలుగా నగర పాలక సంస్థ ఫేస్ బుక్ పేజీ, ట్విట్టర్ ఖాతా, టోల్ ఫ్రీ నెంబర్, స్వచ్ఛతా యాప్ వంటి మాధ్యమాలను అందుబాటులోకి తెచ్చామని, సమస్యలకు ఒక్కరోజులోనే పరిష్కారం లభించేలా అధికారులూ, పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం సేవలు అందింస్తున్నారని కమిషనర్ స్పష్టం చేసారు. నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తిస్తూ ఉన్నత ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు ప్రదానం చేస్తామని, రానున్న రోజుల్లో నెల్లూరు కార్పొరేషన్ పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమం అని నిరూపించుకునేందుకు ప్రజలంతా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేసారు. ర్యాలీలో భాగంగా రోడ్లపై ఉన్న వ్యర్ధాలను కమిషనర్ తొలగించిన అనంతరం కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరిందర ప్రసాద్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.